1 + 1 = 1 అను రెండైనా ఒకటే!

జాక్సన్ విల్ తెలుగు వారందరికి జయనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. కారణం, ఈ ప్రస్తావన అసందర్భంగా కొందరు భావించినా, ఈ విషయం గురించి దేశంబైట వున్న మనం ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం వుందా? అలా మాట్లాడడం వల్ల తెలుగు సంఘంగా మన ఐక్యతకి భగం కలుగుతుందా అని అనుమానించినా, ఈ ప్రస్తావన లేకుండా ఈ ఉగాది సంచిక రావడం లోటు. ఇది గొప్ప చారికత్రక సందర్భం. మనం ఉగాది జరుపుకుంటున్న వారంలోనే తెలుగువారి మరో రాష్ట్రం, కోట్లాది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం, జూన్ 2 న అవతరించబోతోంది. ఇకనుంచి తెలుగువారి కేలండర్ లలో నవంబరు 1తో పాటు ఇంకో సెలవరోజో పండుగరోజో చేరబోతోంది.

నిజమే, ప్రాంతానికేకాదు, దేశానికీ చాలా వేల మైళ్ళ దూరంలో బతుకుతూ, భాషా, దాని చుట్టూ అల్లుకున్న సాహిత్యం సంగీతం కళలతోనే తప్ప ప్రాంతాల పటాలతో సరిహద్దులతో మనకి సంబంధంలేదు. కానీ అకారణంగా ఏళ్ళ తరబడి సాగిన ప్రక్రియ, దాని ఫలితంగా రెండువైపుల అనవసరంగా ఏర్పడ అపోహలు, అకారణ చర్చలూ పేపర్లు, వెబ్ సైట్ లు, సోషల్ మీడియా వాటిని దూరతీరలకి మనకి చేరవేసే తీరు వల్ల మనలో ఏమైనా ఆ అపోహలు ఇంకా మిగిలివుంటే, వాటిని ఒదులుకుని, యుద్ధం కాని యుద్ధం ముగిసిన తరువాత జరగవలసిన ప్రక్రియ, రెండువైపులా జరిగి తీరవలసిన పునర్మిణం. అందులో మనం పోషించవలసిన ఉడత పాత్రకి సిద్ధంకావడం. ఇది మన ముందున్నది.

భారతీయ ఆత్మలో భిన్నత్వంపై గౌరవం చాలా ప్రాధమికమైన అంశం. ఇందుకు దేవుడుకూడా మినహాయింపుకాదు మనకి. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆ రూపం ఒకటైతేనేం? మూడుకోట్లు అయితేనేం? అన్నది తర్కం.

తెలుగువాళ్ళు ఒక రాష్ర్టంగా వున్న, రెండైనా మూడైనా దేశం బైట మనల్ని కలిపివుంచే అంశం భాషే తప్ప ప్రాంతంకాదు. ఈ విషయంలో తాజా ప్రారంభంనుంచి సరైన చైతన్యాన్ని(spirit) చూపుతూనే వుంది, బతుకమ్మ పండగని ఎంత నిబద్ధతో జరిపిందో సంక్రాంతిని అంతే ఉత్సాహంతో జరిపింది. అంతేకాదు, చిన్నవిషయంగా అనిపించినా బహుశా అమెరికాలో ఎక్కడా జరగిని విధంగా, ఆటా, నాటా, తానా అందర్నీ కలపుకుని మణిశర్మ సంగీత విభావరి జరిపింది. దాని విశిష్టత, ఒక చిన్న ఊరు తెలుగు సంఘంగా తాజా ఎగ్జిక్యూటివ్, అడ్వజరి నాయకత్వ చైతన్యం ఉండవలిసిన చోట వుందని చెప్పే నిదర్శనం. కలపుకూ పోవడం, కలిసిపోవడంలోనే మన గెలుపు.

జై జై తెలుగు తల్లీ!!
– రమణ మూర్తి
(Telugu Association of Jacksonville Area, 2014 Ugadi Magazine Editorial)
tajamagazine